చంద్రబాబు వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ జరగాలి..: రేవంత్ షాకింగ్
Revanth Reddy: దేశ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరగాల్సిన అవసరం ఉందని, దీనికోసం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సానుకూలంగా, మరికొందరు ప్రతికూలంగా తమ అభిప్రాయాలను తెలియజేస్తోన్నారు.
ఎక్కువ మంది పిల్లలను కనేలా కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని యోచిస్తోన్నట్లు చంద్రబాబు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే అర్హులు అయ్యేలా చట్టాన్ని తీసుకుని రావాలని భావిస్తోన్నట్లు తెలిపారు.

గతంలో జనాభా నియంత్రణ చర్యలను తాను సమర్థించానని, ఇప్పుడు దేశ సగటు వయస్సు పెరగాలంటే దానికి అనుగుణంగా జనాభా పెరుగుదల అవసరమని పేర్కొన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కల్పించేలా చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుకూలంగా మాట్లాడారు. కొత్త జంటలు 16 మంది పిల్లలను కనాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు 16 రకాల సంపదలు రావాలంటూ తమ పూర్వీకులు ఆశీర్వదించే వాళ్లని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ 16 రకాల సంపదలకు బదులు 16 మంది పిల్లలను కనాలంటూ దీవించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనికి అనుకూలంగా మాట్లాడారు. దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చూస్తే ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఓ జాతీయస్థాయి న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్‌కు ఆయన హాజరయ్యారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పిల్లలను కనాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? అంటూ అడిగిన ప్రశ్నకు సానుకూలంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యం సిద్దించిన సమయంలో దేశ ప్రజల సగటు జీవితకాలం 32 సంవత్సరాలుగా ఉండేదని గుర్తు చేశారు.
అప్పట్లో విద్య, వైద్యం, ఆహారం, మంచి నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉండటం వల్ల జనాభా, కుటుంబ నియంత్రణ అవసరం ఉండేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితులు లేవని పేర్కొన్నారు. వృద్ధుల సంఖ్య అధికం కావడం దేశానికి నష్టదాయకమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పుడు ఆహారం, విద్యుత్ వంటి రంగాల్లో ఎంతో పురోగతిని, సర్‌ప్లస్‌ను సాధించామని రేవంత్ రెడ్డి చెప్పారు. పుట్టింది ఆడపిల్ల అయినా, మగ పిల్లవాడయినా వారిని సంరక్షించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల అన్ని రాజకీయాలు సానుకూలంగా స్పందించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని, దేశానికి ఏది మంచిదో దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications