అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి..!
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన ఇవాళ అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపైనా వారితో చర్చించారు. కొండా సురేఖ అంశంపై ఇక ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఖరారు చేయనున్నారు.
ఇక తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ లో నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత బీఆర్ ఎస్ 10 ఏళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, రగులుతున్న సామాజిక అంశాల నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications