పొంగులేటికి కాంగ్రెస్ భారీ ఆఫర్ - రంగంలోకి రాహుల్ టీం..!!
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ పార్టీలో ఎంట్రీ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి మరో పార్టీలో చేరటం ఖాయమని చెబుతూ వచ్చారు. కానీ, పార్టీ పేరు మాత్రం స్పష్టం చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన మద్దతు దారులతో ఆత్మీయ సదస్సులు నిర్వహించారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లిని ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో, పొంగులేటి తో పాటుగా జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు పొంగులేటికి కాంగ్రెస్ ను భారీ ఆఫర్ వచ్చింది. రాహుల్ టీం సభ్యులు పొంగులేటితో చర్చలు చేసారు.
పొంగులేటికి కాంగ్రెస్ ఆఫర్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా ఇప్పటి వరకు సాగుతున్న ఫైట్ లో కాంగ్రెస్ క్రమేణా బలపడుతోంది. పార్టీకి రాష్ట్ర ఇంఛార్జ్ గా థాక్రే బాధ్యతలు స్వీకరించిన తరువాత మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యులు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ వీడాలని నిర్ణయించిన పొంగులేటి వరుసగా పది నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సస్పెన్షన్ తరువాత బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం పైన సీరియస్ కామెంట్స్ చేసారు. ఖమ్మం జిల్లాలోని పది నియోజవకర్గాల్లోనూ బీఆర్ఎస్ నుంచి ఎవరినీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయనని చెప్పుకొచ్చారు.

ఖమ్మం జిల్లాలో కొత్త సమీకరణాలు : ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ రాహుల్ టీం సభ్యులు ఆహ్వానించినట్లు సమాచారం. పొంగులేటి జిల్లాలో ఆర్దికంగా.. సామాజకంగానే కాకుండా ప్రతీ నియోజక వర్గంలో తనకంటూ మద్దతు ఉన్న నేత కావటంతో ఢిల్లీ ముఖ్య నేతలే రంగంలోకి దిగారు. జిల్లాలోని పది స్థానాలు తన వర్గానికి కేటాయిస్తే తాను పార్టీలోకి రావటానికి సిద్దమని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, జిల్లాలో సీనియర్లు ఉండటంతో..పార్టీలో చేరితే సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా సీనియర్లు మాత్రం పొంగులేటి చేస్తున్న డిమాండ్లు .. పార్టీ నాయకత్వం కొంత మేర సానుకూలంగా స్పందించటం పైన అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణకు ప్రియాంక : పొంగులేటితో పాటుగా జూపల్లిని కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. జూపల్లి గతంలో కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసారు. అటు కాంగ్రెస్..ఇటు బీజేపీ నుంచి ఇద్దరు నేతలకు ఆఫర్లు సిద్దంగా ఉన్నాయని తెలుస్తోంది. జూపల్లి - పాంగులేటి ఈ నెల 23న తమ మద్దతు దారులతో సమావేశం కానున్నారు. తమకు పార్టీల్లో లభించే ప్రాధాన్యతకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని ఈ ఇద్దరు నిర్ణయిస్తే...ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటన సమయంలో ఈ ఇద్దరితో పాటుగా మరి కొందరు చేరికలకు టీపీసీసీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. దీంతో, పొంగులేటి- జూపల్లి కొత్త పార్టీ ఏంటనేది త్వరలో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications