ఉమ్మడి వరంగల్, ఖమ్మంలో కాంగ్రెస్ హవా: కడియం కావ్య, బలరాం నాయక్, రఘురాం రెడ్డి భారీ విజయం
తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దాదాపు చెరి సగం సీట్లను దక్కించుకునేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు కాంగ్రెస్, బీజేపీలు పలు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక,
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు ఖాతాలో వేసుకోగా, మరో రెండింట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో కడియం కావ్య 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీకి చెందిన ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సంజీవ్‌కుమార్ రెండు,మూడు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

మరోవైపు, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 3.5 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మల్లు రవి (నాగర్ కర్నూల్), గడ్డం వంశీకృష్ణ(పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), కుందురు రఘువీర్ రెడ్డి (నల్గొండ), సురేష్ షెట్కార్ (జహీరాబాద్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇది ఇలావుంటే, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications