దళితబంధు త్వరలో మరో నాలుగు నియోజకవర్గాలకు?: సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని మరికొన్ని నియోజకవర్గాలకు విస్తరించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలోని దళితులందరికీ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందజేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా త్వరలో ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు, మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో మండలంలో అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న ఈ నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని సోమవారం(సెప్టెంబర్ 13న) మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ' దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్.. నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు,. మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సిఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు.
పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని తెలిపారు సీఎం కేసీఆర్. కాగా, మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలం ఇలా నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తో పాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల దళిత బంధు పథకం కింద అందించిన విషయం తెలిసిందే. దీంతో వారంతా కేసీఆర్ ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి కూడా రూ. 10 లక్షలు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇంట్లో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ దళిత బంధు పథకం కింద రూ. 10 లక్షల అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దళితబంధు పథకానికి నిధులు మంజూరు కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications