దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తొలగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు మంగళవారం తొలగించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆ పార్టీ నేతలు భారీ హోర్డింగులను రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.
అయితే, ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గం, వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతో వాటిని తొలగించామని ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. అంతేగాక,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు అనుమతి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైపు, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రుత్వికులు యాగాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు.

మంగళవారం ఉదయం గణపతి పూజతో రుత్వికులు యాగం మొదలుపెట్టారు. 12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో పూజ, యాగాలు, పుణ్యాహవాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండి పారాయణం, మూల మంత్ర జపాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నవచండి హోమం, రాజశ్యామల హోమం.. ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టాలన్నారు.
కాగా, ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12.36 గంటలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీఎస్ నేత కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ సహా పలువురు నేతలు, రైతు సంఘాల నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications