కవిత బెయిల్‌పై తీర్పు ఇచ్చిన ఢిల్లీ కోర్టు
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసు.. మరో మలుపు తిరిగింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మంగళవారం అంటే మే 7వ తేదీ నాటికి ఆమె జ్యుడీషియల్ కస్టడీని ముగియాల్సి ఉంది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లపై కిందటి నెల 23వ తేదీన వాదోపవాదాలను ఆలకించిన ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది.
జ్యుడీషియల్ కస్టడీ ముగియడానికి ఇంకా ఒకరోజు గడువు ఉన్నప్పటికీ- బెయిల్ పిటీషన్లపై విచారణ కొనసాగుతున్నందున ఒకరోజు ముందే బెయిల్ పిటీషన్లపై తీర్పు వెలువడించింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు.
ఫలితంగా- జ్యుడీషియల్ కస్టడీ ముగిసేంత వరకూ ఆమె సీబీఐ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందంటూ సీబీఐ, ఈడీ అధికారులు చెబుతున్నారు.
ఇదే కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు బెయిల్ లభించలేదు. అదే సమయంలో- ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు మాత్రం గతంలో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కిందటి నెల 4వ తేదీన సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది.












Click it and Unblock the Notifications