పదవి ఇస్తామంటే ఫలితం మరోలా ఉండేది: బిజెపి అభ్యర్థి దేవయ్య
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ఫలితం పూర్తిగా వెలువడక ముందే బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి పగిడిపాటి దేవయ్య ఓటమిని అంగీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానని అధికారికంగా ప్రకటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కేంద్ర మంత్రి పదవిని అధికారికంగా ప్రకటించకపోవడం వల్లనే తాను ఓటమి పాలయ్యానని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో టిడిపి, బిజెపి మధ్య సమన్వయం జరిగిందని, అయితే టిఆర్ఎస్ అధికార దుర్వ్యినియోగానికి పాల్పడిందని ఆయన అన్నారు. అందుకే ఓట్లన్నీ టిఆర్ఎస్‌కే పడ్డాయని ఆయన అన్నారు.

కాగా, వరంగల్ ఉపఎన్నికల ఫలితాలపై తానేమీ అసంతృప్తి చెందడం లేదని, ప్రజల్లో గుర్తింపు వచ్చిందని దేవయ్య తెలిపారు. ఏడో తరగతి ఫెయిలైన అభ్యర్థి చేతిలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ఓడిపోయారు, నేనెంత? అని ఆయన అన్నారు.
ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ గెలిపొందినా ప్రజలకు ఏమీ చేయదని దేవయ్య అన్నారు. తాను ఓడిపోయన ప్రజలతోనే ఉంటానని, అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దేవయ్య విమర్శించారు. కొన్ని చోట్ల పోలింగ్ శాతం తగ్గడం, నోటాకు ఎక్కువ ఓట్లు పడటం విద్యావంతుల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని దేవయ్య అన్నారు.












Click it and Unblock the Notifications