టీ న్యూస్‌కు నోటీస్: డిజిపితో కెసిఆర్, ఉన్నతాధికారులతో బాబు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీస్ జారీ చేసిన వ్యవహారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు శనివారంనాడు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో డిజిపి అనురాగ్ శర్మ శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంపైనే కాకుండా టీ న్యూస్ చానెల్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్థరాత్రి నోటీస్ జారీ చేయడంపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం చీఫ్ అనురాధ, ఎసిబి డిజి మాలకొండయ్యలతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం.
ఇదిలావుంటే, చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి సీనియర్ నాయకులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంపై చంద్రబాబు వారితో మాట్లాడినట్లు సమాచారం. ఇటీవల ఎసిబి విచారణకు హాజరైన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి, వరుసగా సంభవిస్తున్న పరిణామాలు, భవిష్యత్తు వ్యూహాలపై చంద్రబాబు తెలంగాణ నేతలతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో వేం నరేందర్ రెడ్డితో పాటు తెలంగాణ టిడిపి నాయకులు గరికపాటి రామ్మోహన్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications