రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ ప్రకటన వెనుక కారణమిదేనట!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమావేశంలో పరిపాలనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో తీవ్రదుమారంగా మారాయి. ఇదే సమయంలో రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ సర్కార్ తీరుపైన ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
రేవంత్ నిర్ణయాలపై డీకే అరుణ హెచ్చరిక
రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే ముక్కు నేలకు రాసి దిగిపోవాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పేరుతో రైతులను మరోసారి మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన డీకే అరుణ రేవంత్ రెడ్డిపైన విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేస్తాం.. హామీలు మమ అనిపిస్తాం అంటే ఒప్పుకునేది లేదని, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటామంటే ఊరుకోమని హెచ్చరించారు.

రైతు డిక్లరేషన్ గుర్తు చేసి డీకే అరుణ ఫైర్
ఎన్నికలకు ముందు వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ఇచ్చారని, అందులో 15 వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు 12000 రూపాయలు ఎందుకు ఇస్తామని చెబుతున్నారు అంటూ ఆమె నిలదీశారు. మోసకారి కాంగ్రెస్ రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి రైతులను నిండా ముంచారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల పాలయింది అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.
రైతు భరోసాపై డీకే అరుణ అనుమానం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారంటీని అమలు చేసింది లేదని రైతులను అడుగడుగునా మోసం చేస్తుందని మండిపడ్డారు. మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతు రుణమాఫీ సగం మంది రైతులకు అందలేదని రైతు భరోసా ఎంత మందికి ఇస్తారో కూడా అనుమానమేనని ఆమె వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ప్రకటనల వెనుక స్థానిక సంస్థల ఎన్నికల భయం
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఈ ప్రకటన చేశారని, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల డ్రామా అందుకేనని డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుంది అని ఇంటిలిజెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు రైతు భరోసా ప్రకటన చేశారని ఆమె అన్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని డీకే అరుణ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications