రేవంత్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు: రంగంలో ఈసి, దర్యాప్తునకు రెడీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎన్నికల కమిషన్ (ఈసి) కూడా రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, రేవంత్ రెడ్డితో పాటు ఇతర నిందితులరిమాండ్ డైరీ, ఫిర్యాదుదారుడితోపాటు రేవంత్ వాంగ్మూలం రికార్డు సర్టిఫైడ్ కాపీలను కోర్టు ద్వారా ఈసీ పొందినట్టు తెలిసింది. దీంతో ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన రేవంత్‌పై తాము కూడా విచారణ జరుపుతామని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
కోర్టు నుంచి లిఖితపూర్వక నివేదికలు రావటంతో కేంద్ర ఎన్నిక ల సంఘానికి పూర్తిస్థాయి నివేదికను పంపించేందుకు సిద్ధమవుతున్నట్టు ఈసీ వర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బులిస్తూ అడ్డంగా పట్టుబడ్డ వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఏసీబీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు నివేదిక అందిస్తున్నారు.

కాగా, కోర్టు ద్వారా జరుగుతున్న లిఖిత పూర్వక వ్యవహారాలకు సంబంధించి కాపీలు కూడా తమకు కావాలని ఏసీబీ కోర్టులో ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలోనే ఈసీ పిటిషన్ వేసినా పలు సాంకేతిక కారణాల వల్ల కోర్టు దానిని తిరస్కరించింది. దాంతో రెండురోజులక్రితం సవరించిన పిటిషన్ దాఖలు చేసిన ఈసీకి కోర్టు నుంచి వివరాలు అందినట్లు సమాచారం.
ఈ కేసుకు సముచిత ముగింపు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులకు ఈసి ఇదివరకే లేఖ కూడా రాసింది. దీంతో రేవంత్‌పై ఈసీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం లేకపోలేదని తెలిసింది. రేవంత్ ఆడియో వీడియో, చంద్రబాబు ఆడియో సంభాషణలకు సంబంధించిన లిఖిత పూర్వక నివేదికలను కూడా తాము కోర్టు నుంచి కోరే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు దర్యాప్తు సంస్థ తీసుకుంటున్న నేపథ్యంలో విశ్లేషణ తర్వాత నివేదిక కూడా తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేస్తామని వెల్లడించాయి. ఆ నివేదికను పొందిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేసి చర్యలకు సిద్ధమవుతామని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఎఫ్‌ఎస్‌ఎల్ కోర్టులో దాఖలు చేసిన తాజా నివేదికపై రేవంత్ తరఫు న్యాయవాదులు కూడా శుక్రవారం మెమో దాఖలు చేసినట్టు తెలిసింది. తమకు కూడా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కాపీ ఇవ్వాలని కోర్టును కోరినట్టు తెలిసింది. గతంలో ఎఫ్‌ఎస్‌ఎల్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను రేవంత్ తరఫు న్యాయవాదులు కాపీ ఆఫ్ అప్లికేషన్ (సీఏ) మెమో దాఖలు చేసి తీసుకున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ సమర్పించిన నివేదికను ఇవ్వాలని కోర్టులో గురువారమే మెమో దాఖలుచేసిన ఏసీబీ, శుక్రవారం కోర్టును ఆశ్రయించలేదని తెలిసింది. సుప్రీంకోర్టులో రేవంత్ బెయిల్ రద్దుపై దర్యాప్తు అధికారులు బిజీగా ఉండటం వల్ల రాలేదని ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. శనివారం లేదా సోమవారం ఎఫ్‌ఎస్‌ఎల్ తాజా నివేదికను కోర్టు ద్వారా పొందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications