టీఎస్ఆర్టీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఎన్నికలు జరగలేదని ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. వారి వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
అంతేగాక, గతంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్ తరపు న్యాయవాది ఏకే జయప్రకాశ్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రిటర్నింగ్ అధికారిని నియమించినా ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తూ వస్తున్నారని కోర్టుకు చెప్పారు. రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. గత పాలకవర్గం గడువు ముగిసినా.. కార్మిక శాఖ 2018 నుంచి ఎన్నికలు నిర్వహించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
టీఎస్ఆర్టీసీలో 48వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, తమ యూనియన్ పలు ఎన్నికల్లో గెలిచి గుర్తింపు సాధించిందని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను 24కు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా, నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పునిచ్చింది.

మరోవైపు, ప్రభుత్వం కోర్టు ఆర్డర్స్ ను తుంగలో తొక్కిందని ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వధ్ధామా రెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు జరపడానికి సీఎం ఒప్పుకోరని.. ఏదో సాకుతో ఎన్నికలను ఆపుతారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు.












Click it and Unblock the Notifications