రిషికేశ్వరి కేసు: 'ఆందోళన'పై షాకింగ్, సీటు కోసం కూడానా?
గుంటూరు: ర్యాగింగ్, లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసును అడ్డం పెట్టుకొని కొందరు స్వప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూస్తున్నారని నిఘా వర్గాలు కొంత సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది.
కొన్ని అసాంఘిక శక్తులు ఆందోళనకారుల ముసుగులో రెచ్చగొట్టే కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. రిషికేశ్వరి మృతి కేసును పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరుపుతున్నారు.
మరోవైపు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా రిషికేశ్వరి వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. రిషికేశ్వరి కేసు నేపథ్యంలో వీసీ పదవి కోసం కుర్చీలాట కూడా జరుగుతోన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, రిషికేశ్వరి కేసు పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ స్వప్రయోజనాల కోసమే తప్ప నిజంగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన లేదని విద్యార్థులు కూడా విమర్శిస్తున్నారు.

కాగా, ఆదివారం మంత్రి గంటా మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు అరాచకాలకు, అక్రమాలకు వేదికలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన కమిటీ సూచనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
విశ్వవిద్యాలయాల్లో కుల సంఘాలు లేకుండా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు ఉండకుండా బయోమెట్రిక్ యంత్రాలు, నిఘా కెమేరాలు, ఐ.డి.కార్డులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.
కమిటీ సూచించిన విధంగా ఫ్రెషర్స్ డే దినోత్సవాలు కూడా నెల రోజుల్లోనే కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు. విశ్వవిద్యాలయాల సమస్యల పైనా, ప్రత్యేకించి ర్యాగింగ్ పైనా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 5314ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.












Click it and Unblock the Notifications