డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఇద్దరు దుండగులు ఫోర్జరీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్సు లేఖ తయారు చేశారు. అనంతరం ఆ లేఖను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు. దీంతో నిందితులు ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ డెబ్రూం ఇళ్లు కేటాయించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్సు లేఖలు రాలేదని.. అధికారులు దీన్ని మంత్రి ఎర్రబెల్లి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.

సిఫార్సు లేఖలపై ఆరా తీయగా.. సంగారెడ్డి జిల్లా ఆమీన్‌పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ గౌస్ పాషా, గుంటి శేఖర్ వీటిని తయారుచేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను తయారు చేయడంతోపాటు ఏకంగా మంత్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు లేఖలను పంపించినట్లు గుర్తించారు.
ఈ మేరకు మంత్రి ఓఎస్డీ డాక్టర్ రాజేశ్వర్ రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులైన గౌస్ పాషా, గుంటి శేఖర్‌పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గతంలో ఉద్యోగాల కోసం ఇలాంటి ఫోర్జరీ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఫోర్జరీ సంతకాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications