కేసీఆర్ తన ఆస్తులు అమ్మి ఖర్చు చేయాలి: బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీవ్ర విమర్శలు
నల్గొండ: బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లో చేరారు.

బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రాంజీ గౌతమ్ ప్రకటించారు.

బీఎస్పీతోనే ప్రజలకు న్యాయం: ప్రవీణ్ కుమార్
అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కోసమే పదవి వదులుకున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనుల బతుకులు బాగుపడాలంటే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. బహుజన సమాజంలో బానిసలుగా ఎవరూ ఉండరని, కేవలం పాలకులే ఉంటారన్నారు.

డబ్బుల విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న కేసీఆర్..
మరోవైపు కేసీఆర్ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన ఆస్తులను అమ్మేసి డబ్బులు ఖర్చు చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారే నిర్ణయించుకునేలా చేయాలని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. విచ్చలవిడిగా డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అంటూ కేసీఆర్‌ను ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యి కోట్లు ఎవరి డబ్బులు? అని నిలదీశారు. గిరిజన, ఆదవాసీ బిడ్డలు సాగు చేసిన డబ్బులే ఇచ్చారన్నారు. తమ కష్టార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
Recommended Video

కేసీఆర్ సంపాదించిన సొమ్ములోంచి ఖర్చు పెట్టాలి..
దళిత, గిరిజనులపై ప్రేమ ఉంటే కేసీఆర్ సంపాదించిన సంపాదించిన సొమ్ము ఇవ్వాలన్నారు. పేదలకు వైద్యం, విద్య, ఉపాధి నైపుణ్యం కావాలన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా కేవలం 4 లక్షల మందికే విద్య అందుతోందని, 35 లక్షల మంది విద్యార్థులను వదిలేశారన్నారు. పేదలు చదివే వర్సిటీల్లో 3-4 ఏళ్లుగా నియామకాలు లేవన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మరి ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? అని ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో మరో పార్టీ క్రియాశీలకంగా మారనుందనే చెప్పాలి. ఇప్పటికే వైఎస్ షర్మిల తన పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications