Hyderabad: జర్మనీ యువతిపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితుడిని కలిసేందుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు జర్మనీలో చదువుకున్నాడు. అతడ్ని కలిసేందుకు వారం రోజుల క్రితం జర్మనీకి చెందిన యువతి(25) హైదరాబాద్ వచ్చింది. సోమవారం స్నేహితులతో కలిసి ఇక్కడ పలు ప్రాంతాలు సందర్శించింది.

స్నేహితులను డ్రాప్ చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా.. మామిడిపల్లి వద్ద కారు డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణం స్పందించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మీర్‌పేట పోలీసులు ఈ కేసును పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళ ఒంటరిగా రావడాన్ని నిందితులు అదనుగా తీసుకున్నారని, ఆమెను బెదిరించి అత్యాచారం చేశారని చెప్పారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు.












Click it and Unblock the Notifications