రైతులకు శుభవార్త.!వేగంగా ధాన్యం కొనుగోళ్లు.!బకాయిల చెల్లింపు.!కలెక్టర్ల సమీక్షలో మంత్రి గంగుల.!
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతుందని, గతంకన్నా పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, రాబోయే పదిరోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం దిగుమతి సమస్య ఉత్పన్నం కావద్దని, రైతులు రోడ్ల పైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు తీసుకొని మిల్లర్లతో సంబందం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈమేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుదవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు మంత్రి గంగుల కమలాకర్.
అంతే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణ చేస్తున్న కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్. గతం కన్నా 500 కొనుగోలు కేంద్రాలు, గతం కన్నా అధికంగా రైతుల నుండి సేకరణ, అధికంగా నిధులను అందజేసామన్నారు.

సీఎం చంద్రశేఖర్ రావు రైతు పక్షపాతి అని, వ్యవసాయం పండగ చేసేలా అవసరమైన నీళ్లు, ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందజేస్తూ దేశంలోనే ఎక్కడాలేని విదంగా కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నారని, ఈ సమయంలో అక్కసుతో ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను పట్టించుకోవద్దని, కేవలం రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసి ధాన్యం సేకరణ చేయాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి గంగుల.
ధాన్యం సేకరణతో పాటు సీఎంఆర్ ప్రక్రియ కూడా జరుగుతుండడంతో అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్లు మంత్రి ద్రుష్టికి తెచ్చారు. ప్యాక్స్ గోదాంలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోదాంలు, రైతువేదికలు, తదితర ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేట్ ఇంటర్మీడియట్ గోదాంల ఏర్పాటుతో ఈ సమస్యలను అధిగమిస్తున్నామని కలెక్టర్లు వెల్లడించారు.

మంత్రి గంగుల ఆదేశం మేరకు రాబోయే పదిహేను రోజులు జిల్లాయంత్రాంగం పూర్తిగా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తామని కలెక్టర్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications