తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
చెప్పినట్లుగానే దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం కరవు భత్యం (DA) పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు.
2022 జులై 1 నుంచి 2024, అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జయ చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. 90 శాతం 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు.. పెండింగ్‌లో ఉన్న డీఏ తోపాటు మెడికల్ బిల్లులు, ఈహెచ్ఎస్ స్కీమ్, లోక్‌సభ ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి పాత స్థానాల్లో పంపించడం, సీపీఎస్ రద్దు తదితర మొత్తం 50 సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపింది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం.. అక్టోబర్ 26న జరిగిన కేబినెట్ భేటీలో గవర్నమెంట్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగ సందర్భంగా డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications