గుండె తరుక్కుపోతోంది, ప్రభుత్వం స్పందించాలి: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను కలిసి వారితో మాట్లాడారు. వరద ప్రాంతాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట పలు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించిన గవర్నర్.. అనంతరం ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తమిళిసై.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందుగా హనుమకొండలోని జవహర్‌నగర్, నయీమ్‌నగర్ ముంపుప్రాంత ప్రజలను పరామర్శించి వారికి హెల్త్ అండ్ హైజీన్ కిట్లను అందజేశారు.

భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్‌తోపాటు ఎన్ఎన్నగర్ ముంపు ప్రాంతాలను గవర్నర్ తమిళిసై సందర్శించారు. వరదలతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మన అక్కలు, అన్నదమ్ములు ఇలా వరదల కారణంగా ఇబ్బందిపడటం చాలా బాధాకరంగా ఉంది. వరంగల్ వరద బాధితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని గవర్నర్ తమిళిసై అన్నారు.
'రెండు రోజుల క్రితం వరదలు చాలా భీభత్సంగా ఉన్న సమయంలో నేను వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమావేశమయ్యాను. నేను వారికి విజ్ఞప్తి చేశాను. వారు తక్షణమే చర్యలు చేపట్టారు. వారి చేసిన నిరంతరమైన సేవకు ధన్యవాదాలు చెప్పాలి. ఎన్జీవోలు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా సహాయం చేశారు' తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
వరంగల్ జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారిందని.. ప్రభావిత ప్రాంతాలన్నింటిపైనా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ కోరారు. వర్షాన్ని, వరదలను నియంత్రించలేమని.. ఇలాంటి పరిస్థితికి గల కారణాలపై దృష్టి సారించాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గవర్నర్ స్పష్టం చేశారు. వరదల తర్వాత తలెత్తే సమస్యల పట్ల అధికార యంత్రాంగంగ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసన భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదంతో ఇప్పుడిప్పుడే ఇళ్ల బాట పడుతున్న వారికి వారి ఇళ్లను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. వరదల్లో కావాల్సిన వాళ్లను, పాడిపశువులను కోల్పోయిన బాధిత ప్రజలు.. ఇంట్లో ఏమీ మిగలకపోవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటలు పూర్తిగా పోయాయని, ఇళ్లలో తినడానికి తిండి కూడా మిగల్లేదని వాపోయారు. చాలా ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని, తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications