హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్
చాలాకాలం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరుకావడం ఇదే మొదటిసారి.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఆయన అందించిన సేవలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా, సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కుటుంబంతో జగన్‌కు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఈ వివాహ వేడుకకు ప్రత్యేకంగా హాజరు కావాల్సి వచ్చింది.

ఈ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన 11 గంటలకు బేగంపేట్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెక్లెస్ రోడ్ జలవిహార్ కు చేరుకున్నారు. దారి పొడవునా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అభిమానులు. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో ఈ మార్గం మొత్తం నిండిపోయింది. వారందరికీ అభివాదం చేస్తూ కదిలారు జగన్.
జలవిహార్ వద్ద పీఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం ఇచ్చి జగన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరుల వద్దకు వెళ్లి అక్షింతలు వేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు. 12:05 నిమిషాల వరకు అక్కడే గడిపారు. అనంతరం బెంగళూరుకు తిరుగుముఖం పట్టారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరు, పులివెందులలో గడుపుతున్నారు. పార్టీ శ్రేణులతో సమీక్షలు, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన ఆయన, చాలారోజుల తర్వాత హైదరాబాద్‌లో ఒకే వేదికపై పాత మిత్రులను, అధికారులను కలుసుకున్నారు. ఈ వేడుకలో జగన్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు అతిథులు ఆసక్తి చూపించారు. కాగా జగన్ కు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications