గురుకులంలో ఘోరం: విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ..
విద్యార్థినులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ టీచర్ తన బాధ్యతను మరిచి పైశాచికంగా ప్రవర్తించింది. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే.. లేట్ ఎందుకవుతుందంటూ వేధించింది. అంతేగాక, డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ కొట్టింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. వేధింపులకు గురిచేస్తున్న పీఈటీ జ్యోత్స్న ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. అంతేగాక, 500కు పైగా విద్యార్థినులకు రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. సారంగపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న.. విద్యార్థినుల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తోంది. స్కూల్ ప్రేయర్ కు విద్యార్థినులు ఆలస్యంగా వస్తే ఇష్టం వచ్చినట్లు దూషించింది. కొంతమంది విద్యార్థినులు పీరియడ్స్ కారణంగా ఆలస్యంగా వచ్చామని చెప్పుకున్నా.. ఆమె వినిపించుకోలేదు.
అంతేగాక, దుస్తులు విప్పించి తమ పట్ల ఘోరంగా ప్రవర్తించినట్లు విద్యార్థినులు వాపోయారు. బాత్‌రూంలోనే విద్యార్థినుల బట్టలు విప్పించి, కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీ జ్యోత్స్నను వెంటనే తొలగించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల: గురుకులంలో సైకో పీఈటీ.. విద్యార్ధినుల ఆవేదన#RajannaSircilla #Students #PT #ViralVideo #Telangana #Oneindiatelugu pic.twitter.com/lqLjWpdIZ3
— oneindiatelugu (@oneindiatelugu) September 12, 2024
జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపాల్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోయారు. అంతేగాక, 500కుపైగా విద్యార్థినులుండగా.. రెండే బాత్రూంలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో పీఈటీ వచ్చి వీడియోలు తీస్తోందని, కొడుతోందని వాపోయారు. పీఈటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications