అగ్నిగుండం - వడదెబ్బతో ఒక్కరోజే 22 మంది మృతి, తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలతో పలు ప్రాంతాలు ఉడుకు తున్నాయి. ప్రభుత్వం పెరుగుతున్న ఎండల తీవ్రత వేళ అప్రమత్తం చేస్తోంది. కీలక సూచనలు చేసింది. మరో వారం వరకు ఇదే విధంగా ప్రచండంగా ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాల్పుల తో వడదెబ్బ కారణంగా ఒకే రోజు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. తాజా వడగాలుల తీవ్రత పైన వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది.
అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఉదయం సమయంలోనే ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో గురువారం ఒక్కరోజే 22 మంది మరణించారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారు. ఈ రోజు.. రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలు లు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో మూడు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటాయి. సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలులు వీచాయి. భానుడి ప్రతాపానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తెలంగాణకు పొడిగాలులు వస్తుండటంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భరించలేని విధంగా వాతావరణం మారుతోంది. శుక్ర, శని వారాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వడగాల్పుల తీవ్రత వేళ అందరూ అప్రమత్ తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందు వల్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేసారు.













Click it and Unblock the Notifications