Hcu వివాదంలోకి తెలుగు హీరోయిన్..కాపాడంటూ పోస్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూవివాదం ఇటీవల తెలంగాణలో ఒక ముఖ్యమైన రాజకీయ వివాదంగా మారింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని.. వేలం వేయడాన్ని ఆపాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
ఈ వివాదంపై తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా స్పందించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి విద్యార్థులు చేస్తున్న ధర్నాకు ఆమె తన మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు ఇవ్వగా, ఇప్పుడు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా తన మద్దతు ఇస్తున్నట్టు పోస్ట్ పెట్టారు.దీంతో సోషల్ మీడియాలో ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హెచ్‌సీయూ వివాదానికి వస్తే..
1974లో హెచ్‌సీయూ స్థాపించబడినప్పుడు, అప్పటి ప్రభుత్వం సుమారు 2300 ఎకరాల భూమిని కేటాయించింది.కాలక్రమేణా నగరం విస్తరించడంతో ఈ భూమి విలువైన రియల్ ఎస్టేట్‌గా మారింది.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 534.28 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయం నుండి తిరిగి తీసుకుంది. దానికి బదులుగా గోపన్‌పల్లిలో 396 ఎకరాలు కేటాయించింది. ఈ ఒప్పందం ప్రకారం 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. 21 సంవత్సరాల క్రితం ఈ 400 ఎకరాలను IMG అకాడమీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
హెచ్‌సీయూ విద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ భూమిని విశ్వవిద్యాలయంలో భాగంగా భావిస్తున్నారు.ఈ ప్రాంతంలో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 2 సరస్సులు (పీకాక్ లేక్, బఫెలో లేక్) ఉన్నాయని వారు చెబుతున్నారు.ఇది జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉందని, దీన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం సరికాదని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
అభివృద్ధి ప్రాజెక్టులు సరస్సులను, పర్యావరణ ప్రాంతాలను ప్రభావితం చేయవని ప్రభుత్వం హామీ ఇచ్చింది.మష్రూమ్ రాక్ వంటి సహజ నిర్మాణాలను కాపాడేందుకు ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (EMP) ఉంటుందని చెబుతోంది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిపై హక్కులు కోరగా, టీజీఐఐసీ ఈ భూమి ప్రభుత్వానిదని పేర్కొంది. ఈ వివాదంపై విద్యార్థులు ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.












Click it and Unblock the Notifications