అలా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చు.. ఎన్నికల సంఘానికి హైకోర్టు!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోను ఉత్కంఠ నెలకొంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించిన హైకోర్టు ఇదే సమయంలో ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
రిజర్వేషన్ లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లు ఏవైనా 50 శాతానికి మించకూడదని పేర్కొన్న హైకోర్టు ప్రభుత్వం జీవో 9 జారీ చేయడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయని కోర్టు అభిప్రాయపడింది.జీవో జారీ చేయకముందు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, ఓబీసీలకు 25 శాతం కలిపి మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని కిషన్ రావు కబాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితికి లోబడి ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

రిజర్వేషన్ లపై ప్రభుత్వ వాదన ఇలా
అయితే వెనుకబడిన వర్గాల పై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్ ను ఏర్పాటు చేసి, కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పరిమితి అనేది కఠినమైన నియమం కాదని, దానిని సవరించుకునే వీలు ఉంటుందని హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.
తాము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదన్న హైకోర్టు
రాజ్యాంగంలోని అధికరణ 243 ఓ ప్రకారం సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించిన ఎన్నికల ప్రక్రియలో తమ జోక్యం చేసుకోలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. నమోదైన పిటిషన్లలో వివాదాన్ని తేల్చే దాకా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోతో పాటు తదనంతర ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన జీవోలు 41, 42 లను మాత్రమే నిలిపివేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
బీసీ రిజర్వేషన్ ల పై సుప్రీం మెట్లు ఎక్కనున్న ప్రభుత్వం
పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవడానికి, ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ దిశగా ఎన్నికల సంఘం ముందుకు వెళ్లొచ్చు అని సూచించింది. ఇదిలా ఉంటే ఎన్నికల విషయంలో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీసీ రిజర్వేషన్ ల పై స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications