Hyderabad: ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం
హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో ఆనం మీర్జా ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆనం మీర్జా ఎక్స్‌పోలో ఓ దుకాణదారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. భారీ శబ్ధాలు రావడంతో ఒక్కసారిగా ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
కాల్పులు జరిగిన వెంటనే కొంతమంది అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు డిక్కీలో మహిళ మృతదేహం
గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో ఓ కారును వెంబడించిన పోలీసులకు షాక్ తగలింది. ఆ కారు డిక్కీలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముబారక్ నగర్‌కు చెందిన బింగి కమల (46) అనే వివాహితకు అదే గ్రామానికి చెందిన రాజేష్ గురువారం ఫోన్ చేసి మాధవనగర్ బైపాస్ రోడ్డుకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె కొద్ది సేపటికి ఆటోలో అక్కడికి చేరుకుంది.
తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనే కోపంతో ఉన్న రాజేష్.. కమలను మాధవనగర్ బైపాస్ రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటిపత్రి, రాళ్లను కప్పి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత శుక్రవారం (మార్చి 28) అద్దెకు కారు తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో వేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి అతివేగంగా ఆర్మూర్ వైపు కారులో వెళ్తుండగా మాక్లూరు స్టేషన్ పోలీసులు గమనించారు.
అయితే, డిక్కీలోని తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో కారును పోలీసులు వెంబడించారు. పోలీసులు దాస్‌నగర్ సమీపంలోని కాలువ వద్ద కారుని ఆపి తనిఖీ చేయగా.. డిక్కీలో మహిళ మృతదేహం కనిపించడంతో షాక్ అయ్యారు. నిందితుడిని ప్రశ్నించగా జరిగినదంతా పోలీసులకు చెప్పాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications