నిమజ్జనం వేళ ఈ రూల్స్ పాటించాల్సిందే..!!
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు సిద్దం అవుతున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు పైన ప్రకటన చేసారు. నిమజ్జనం భారీగా జరిగే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. 18 వేల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇదే సమయం లో నిమజ్జనం వేళ కీలక నిబంధనలు ప్రకటించారు.
నిమజ్జన శోభా యాత్ర వేళ
వినాయక నిమజ్జన శోభాయాత్రకు భాగ్యనగరం సిద్దమవుతోంది. నిమజ్జనం రోజున అవసరమైన అన్ని చర్యలు పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీకి సూచనలు చేసారు. ప్రశాంతంగా పండుగ వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదే విధంగా సౌత్ జోన్ పరిధుల నుంచి విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలని తెలిపారు. దీంతో పాటుగా మరి కొన్ని కీలక అంశాలను సూచించారు.

భారీ బందోబస్తు
ఒక గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలకు నెంబర్ కేటాయిస్తున్నారు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్‌ను అమర్చకూడదని స్పష్టం చేసారు. నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌కు అనుమతి లేదని చెప్పారు. రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులను ఉపయోగించకూడదని పేర్కొన్నారు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తుమందులు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదని పోలీసులు తేల్చి చెప్పారు.
పోలీసుల సూచనలు
ఊరేగింపులో ఎవరూ కర్రలు/కత్తులు, కాల్పులు ఆయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదని స్పష్టం చేసారు. ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/రెచ్చగొట్టే ప్రసంగాలు/నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించకూడదు. జనాలలో ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించాలని.. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications