హైడ్రా వ్యవస్థ ఇకపై జిల్లాల్లోనూ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం వరదలలో చిక్కుకున్న వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించి ప్రజలకు భరోసా కల్పించడంతో పాటుగా అనేక కీలక ప్రకటనలు చేస్తున్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కేంద్రానికి రేవంత్ డిమాండ్
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు తనతో పాటు మంత్రులు సంబంధిత కలెక్టర్లు అధికారులతో మాట్లాడారని సర్కార్ అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా జరగకూడని నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి
వరదలలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన తక్షణ చర్యలు తీసుకోవడంతోనే భారీ ప్రాణ నష్టం తగ్గిందని ఈ విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులను అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాథమికంగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టుగా అంచనా వేశామన్నారు.
వరద ముంపు వేళ హైడ్రాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రస్తుతం ఇంకా వరద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. వరద నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానిని ఆహ్వానించినట్టుగా ఆయన తెలిపారు. చెరువులను కబ్జా చేయడం వలన ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆక్రమణలను అడ్డుకోవడానికి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒత్తిడులు వచ్చిన హైడ్రా ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం
ఇక హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలని డిమాండ్ వస్తోందని, త్వరలోనే జిల్లాలలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు. చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా వరద పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెరువులు కుంటలు ఆక్రమించుకున్న అక్రమార్కుల భరతం పట్టి భవిష్యత్తులో ముంపు రాకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications