వామ్మో.. 317 ఎకరాలు కబ్జా: హైడ్రా తాజా కూల్చివేతలు
HYDRAA: హైడ్రా.. తాజా కూల్చివేతలను చేపట్టింది. హైదరాబాద్‌లోని గాజలరామారం-కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో భారీగా వెలిసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను తొలగించింది. ప్రభుత్వ భూములను విడిపించింది. దాదాపు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి హైడ్రా అధికారులు తిరిగి తీసుకున్నారు. ఈ భూమి విలువ 12,000 కోట్ల నుండి 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
రెవెన్యూ శాఖ, పోలీసుల సహకారంతో హైడ్రా ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. బుల్ డోజర్లు, జేసీబీలతో వచ్చిన హైడ్రా అధికారులు వాటి కూల్చివేత పనులు చేపట్టారు. సర్వే నంబర్ 307 పరిధిలోని ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఆక్రమించిన భూముల్లో ఉన్న కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు.
ఈ భూములను ల్యాండ్ గ్రాబర్లు, రియల్టర్లు, రాజకీయ నాయకులు, కొందరు అధికారులు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూల్చివేశారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలలకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా భూములను ఆక్రమించుకున్న పలుకుబడి గల వ్యక్తులు, నకిలీ ఓఆర్‌సీ (పట్టాదారు పాస్ బుక్) కలిగిన వారిపై ఈసారి ఎటువంటి మినహాయింపు ఉండదని హెచ్చరించారు.
ఇప్పటికే 275 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భూ మాఫియాపై ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలకు ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని తిరిగి ప్రజల అవసరాల కోసం వినియోగిస్తారని తెలియజేశారు. గతంలో శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను కాపాడింది. ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చివేసింది. ఆ స్థలాలకు విముక్తి కల్పించింది.












Click it and Unblock the Notifications