ప్రభుత్వ ఆస్తులు అమ్మడం భావితరాన్ని హత్య చేయడమే.!టీ సర్కార్ బీసీలను మోసం చేస్తుందన్న షర్మిళ.!
హైదరాబాద్ : ఎన్నికల వేళ సీఎం చంద్రశేఖర్ రావు దొరకు బీసీలు గుర్తుకొచ్చారని, ఓట్ల కోసం లక్ష సాయమంటూ 'నయా'వంచనకు తెరలేపాడని వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశారని, గిరిజన బంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించారని ఆగ్రహం వ్యక్తం చేసారు షర్మిళ.
ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, 9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించినా సీఎం పట్టించుకోలేదని షర్మిళ మండిపడ్డారు. బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదన్నారు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని, బీసీ బిడ్డలకు 3 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు షర్మిళ.

అంతే కాకుండా బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదని, బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డారని షర్మిళ మండిపడ్డారు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలి, చేపలు పట్టుకోవాలి గానీ, సీఎం కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? అని నిలదీసారు షర్మిళ. ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన సీఎంకు, 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయన్నారు షర్మిల.

ఆనాటి దొరలు బలవంతంగా భూములు దోచుకుంటే, నేటి దొర జీవోలతో భూములు అమ్మేసి, వేల కోట్లు వెనకేస్తున్నారన్నారు. రైతులకిచ్చిన అసైన్డ్ భూములను, పరిశ్రమలకిచ్చిన భూములను సైతం వదలడం లేదన్నారు షర్మిళ. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే భావితరాన్ని హత్య చేయడమేనన్నారు. భవిష్యత్తు అవసరాలకు భూములే లేకుండా కొల్లగొడుతున్నారని, ఇలాంటి చర్యలు ఆపాలని షర్మిళ ట్వీట్ చేసారు.












Click it and Unblock the Notifications