మళ్లీ ముంచుకొస్తోంది, నాలుగు రోజులు దంచుడే - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
భారీ వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనునున్నాయి. ఇదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు అరేబియా సముద్రంలో లక్షద్వీప్ పరిసరాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడుతుందని, 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి విజయవాడ, ఏలూరు, విశాఖ జిల్లాల్లో వర్షం కొనసాగుతోంది.

అటు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. రేపు (సోమవారం) తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications