ఈనెలాఖరున రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెబుతున్న కేంద్రం
దేశవ్యాప్తంగా 13,600 రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజు ఇవి కోటి మందికిపైగా ప్రయాణికులను, పండగ సమయాల్లో, ఇతర రద్దీ సమయాల్లో రోజుకు 2 కోట్లమంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయితే రిజర్వేషన్ దొరక్కపోతే జనరల్ బోగీలోనైనా సౌకర్యవంతంగా ప్రయాణిద్దామంటే ఆ బోగీల్లో మరుగుదొడ్లలోకి కూడా వెళ్లడానికి అవకాశం లేకుండా అందులో కూడా ఐదారుగురు ప్రయాణికులుంటారు. అంతలా కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకు కారణం సాధారణ ప్రయాణికులను వారి మానాన వారిని వదిలేసి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికే అత్యధిక ప్రాధాన్యతనివ్వడం. ఈ క్రమంలోనే నాన్ ఏసీ స్లీపర్ బోగీలను కూడా తగ్గించుకుంటూ ఏసీ బోగీలను పెంచుకుంటూ కేవలం ఆదాయంపైనే భారతీయ రైల్వే దృష్టి పెట్టింది.
విశాఖలో కేసుల నమోదు
ఇటీవలే సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో దివ్యాగుల బోగీలో, జనరల్ బోగీల్లో మరుగుదొడ్లలో కూడా నిలబడి ప్రయాణిస్తున్నారంటూ రైల్వే ప్రొటెక్సన్ ఫోర్స్ పోలీసులు కేసులు నమోదుచేసి ప్రయాణికులను రైలు నుంచి దించేశారు. తర్వాత మరో రైలు లేదు. ఆ సమయంలో వారు ఎలా వెళతారు? అటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు రావడంతో జనరల్ బోగీల పెంపుపై ఇప్పుడు రైల్వే దృష్టిసారించింది.

10వేల జనరల్ బోగీల ఏర్పాటు
ఈ సంఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో మళ్లీ రైల్వే దారికి వచ్చింది. సాధారణ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల కిక్కిరిసి ప్రయాణించాల్సిన అవసరం తప్పుతోంది. నవంబరు చివరి నాటికి వీటిని ఆయా రైళ్లకు జోడించనున్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో రైళ్లకు 10వేల జనరల్ బోగీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఆరువేల బోగీలు జనరల్ బోగీలుకాగా, నాలుగువేల బోగీలు నాన్ ఏసీ స్లీపర్ బోగీలు. దీనివల్ల రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు జాబితాను తొలగించాలన్నదే రైల్వే లక్ష్యం.
ప్రతిరోజు 8 లక్షల మంది ప్రయాణిస్తారు
ఈ బోగీలన్నీ అందుబాటులోకి వస్తే ప్రతిరోజు కొత్తగా 8 లక్షల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణిస్తారు. రైళ్లల్లో రిజర్వేషన్ కు టికెట్ కన్ ఫామ్ అవుతుంది. ప్రయాణించే రోజువరకు టెన్షన్ గా సీటు దొరుకుతుందా? లేదా? అని ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. గడిచిన మూడు నెలల్లో కొన్ని రైళ్లకు 600 అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే ప్రత్యక్ష నరకం కనపడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. వారి వెతలన్నీ తీర్చేందుకే అదనపు బోగీలను తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు సాధారణ ప్రయాణికులపై కనికరం చూపారని, అందుకు కృతజ్ఞతలని అంటున్నారు.












Click it and Unblock the Notifications