Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3 గంటలు..
ఆదివారం యాదిగిరిగుట్టకు భారీగా భక్తులు తరలొచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చాయి.ఈ మధ్యే ఇంటర్ ఫలితాలు రావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు చాలా మంది వస్తున్నారు. గుడిలోని క్యాలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇక రూ. 150 ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. గుట్టపైన ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. కల్యాణకట్ట, ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ భారీగానే కనిపిస్తోంది. ఎండకాలం కావడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం తాగు నీటి సౌకర్యం కల్పించారు.

కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని, ఆదివారాలు సెలవు కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులతో 31 కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం స్వామివారిని 57,909 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,403 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లుగా ఉంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు నీరుతో పాటు అన్న ప్రసాదం అందజేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications