కడుపులో క్లాత్ వదిలేసిన డాక్టర్ల ఘనకార్యం; 16నెలలుగా మహిళ నరకం.. ఏం వైద్యులురా నాయనా!!
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దైవంతో సమానం. అటువంటి వైద్యులు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులు ప్రస్తుతం అడుగడుగున కనిపిస్తున్నాయి. ధన్వంతరి వారసులుగా వైద్య వృత్తిని ఎంచుకుని ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పని చేస్తామని ప్రమాణం చేసి వచ్చిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతో మంది జీవితాలను నరకం చేస్తోంది. తాజాగా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నమిలికొండ కు చెందిన నవ్యశ్రీ అనే మహిళ కడుపునొప్పితో 16 నెలలుగా అల్లాడుతుంది. నవ్య శ్రీ కి 16నెలల క్రితం జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేశారు. అప్పుడు ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఆమె కడుపులోని క్లాత్ వదిలిపెట్టి కుట్లు వేసేశారు. ఇక ఆ తర్వాత నుండి వరుసగా కడుపునొప్పితో బాధపడుతున్న నవ్య శ్రీ తిరగని డాక్టర్లు లేరు.

ఇక కడుపు నొప్పి తీవ్రం కావడంతో వేములవాడ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నవ్య శ్రీని చూసిన వైద్యులు అసలు జరిగింది తెలుసుకుని అవాక్కయ్యారు. నవ్యశ్రీ కడుపును స్కానింగ్ చేసిన వైద్యులు, ఆమె కడుపులో ఒక క్లాత్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆపరేషన్ చేసి బయటకు తీయాలని నవ్య శ్రీ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి నవ్య శ్రీ కడుపులో ఉన్న క్లాత్ ను తొలగించారు.

ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మహిళ కడుపులో నుండి క్లాత్ ను తొలగించే దృశ్యాలను వీడియో తీశారు. దీంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా నవ్య శ్రీ నరకయాతన చూసిందని నవ్య శ్రీ కుటుంబ సభ్యులు జగిత్యాల డీఎంహెచ్వో కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కాపాడతారని నమ్మి ఆస్పత్రులకు వెళితే వైద్యులు ఇలా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించటం దారుణం అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications