తెలంగాణలో ట్రూ 5జీ సేవల విస్తరణపై జియో కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ జియో 5జీ(Jio 5g) సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ జియో తన 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకుక 850కిపైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను తీసుకొచ్చినట్లు జియో సంస్థ తెలిపింది.
వినియోదారులకు అత్యుత్తమ ట్రూ 5జీ అనుభవాన్ని అందించడం పట్ల జియో చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఓ ప్రకటనలో వెల్లడించింది. జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన అన్ని ప్రాంతాల్లో వెల్‌కమ్ ఆఫర్ కింద 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను వినియోగదారులకు ఉచితంగా వినియోగించవచ్చని జియో తెలిపింది.

తెలంగాణలోని కీలక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థల్లో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా, ఈ నగరాలు, పట్టణాలకు చేరువలో ఉండే గ్రామాలు కూడా జియో 5జీ కనెక్టివిటీతో లబ్ధి పొందుతారని వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను విస్తరించినందుకు తామెంతో సంతోషిస్తున్నామని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
2023 డిసెంబర్ చివరి నాటికి దేశ వ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకాలో టూ 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో జియో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. కాగా, ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రామస్థాయికి కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో కసరత్తులను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
