కేసీఆర్ జాతీయ పార్టీకి స్వాగతం.. టీడీపీతో కాదు, పవన్ పార్టీతోనే పొత్తు: లక్ష్మణ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ్య సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీకి స్వాగతం.. పవన్ కళ్యాణ్ పార్టీతోనే పొత్తు
ఇక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని, అక్కడి ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి పోటీ చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

టీడీపీతో పొత్తు అనేది ప్రచారమేనన్న లక్ష్మణ్
తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని లక్ష్మణ్ కొట్టిపారేశారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనే కాదు.. దేశంలో కూడా ఎక్కడా లేదన్నారు. బీజేపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమయం, అవసరాల రీత్యా కొందరు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు.

వెంకయ్య నాయుడు తర్వాత తానేనంటూ లక్ష్మణ్
క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్రమంత్రి పదవిగా భావిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రెండో వ్యక్తిని తానేనని చెప్పారు. ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీ పోటీ అనేది పార్టీ నిర్ణయిస్తుందని లక్ష్మణ్ తెలిపారు. తన సొంత నిర్ణయాలుండవని, పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.

బలహనీ వర్గాలకు మోడీ సర్కారు పెద్దపీట: లక్ష్మణ్
ఇది ఇలావుండగా, ముషీరాబాద్ జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఫొటో ఎగ్జిబిషన్ను లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ పెద్దపీట వేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లు తెలిపారు. కేబినెట్లో బలహీన వర్గాలకు చెందిన 27మందికి మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ మెడికల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మోడీ జీవిత చరిత్ర, అభివృద్ధి కార్యక్రమాలు అందరికి తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2న ఖాదీ మేళా పేరుతో చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ వివరించారు.












Click it and Unblock the Notifications