నేను బహుజనుల బాణాన్ని.. సీఎం రేవంత్ అడ్డాలో TRS చీఫ్ కవిత సవాల్
తనను బీఆర్ఎస్ వదిలిన బాణమని కొంతమంది, కాంగ్రెస్ బాణం అంటూ మరికొంతమంది చేస్తున్న విమర్శలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ తో అయినా కొట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆదివారం నిర్వహించిన 'పాంచజన్య సంకల్ప సభ' లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మోదీ, రేవంత్, కేసీఆర్ తో అయినా కొట్లాడతా..
తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీలతో పోరాటం చేసి చూపిస్తానని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానని తెలిపారు. ఇన్నాళ్లు అయ్యల పాలనలో ఒరిగిందేమీ లేదని ఇక తెలంగాణలో మాతృస్వామ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బీఆర్ ఎస్ కు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే చేసేందేమీ లేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఒక తల్లిలాగా ఆలోచించి పాలన సాగిస్తానని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
నేను బహుజనుల బాణాన్ని... కేసీఆర్, రేవంత్, మోదీ ఎవరితోనైనా కొట్లాడుతా: కవిత!#KalvakuntlaKavitha #TRS #PoliticsToday #Telangana #OITelugu pic.twitter.com/IdD8tCvleA
— oneindiatelugu (@oneindiatelugu) September 20, 2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కూడా డబ్బులు అడుగుతున్నారని కవిత తెలిపారు. ఇప్పటికీ నీళ్లు రాని ఎన్నో గ్రామాలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఆయన తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ మళ్లీ వెనక్కి వెళ్లిందన్నారు. గట్టు, కేటిదొడ్డు మండలాల్లో అఫ్గానిస్తాన్ తో సమానంగా అక్షరాస్యత ఉందని.. అందుకు సీఎం సిగ్గుపడాలన్నారు. విద్యా శాఖ మంత్రిగాను ఉన్న ముఖ్యమంత్రి రెండేళ్లలో పరిస్థితి మార్చాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ కు 13 సీట్లు ఇస్తే ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇండ్లలో డబ్బుల దందా చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని కోరారు.
10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే పేరు మార్చుకుంటా
రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, కరెంట్, నీళ్లు, రైతు భరోసా, మద్దతు ధర ఇలా ప్రతి దానికి రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకుంటున్న సంఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని తెలిపారు. రైతులకు కనీసం సాగు నీళ్లు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావటం లేదని విమర్శలు గుప్పించారు.
జురాల వద్ద రెగ్యులేటర్ ను పగలకొట్టి రైతులు నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జురాల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్న సరే చేయటం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక జురాల నుంచి నీటిని ఎత్తిపోసి కొడంగల్, మక్తల్, నారాయణ్ నుంచి ఇబ్రహీం పట్నం వరకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని భరోసా ఇచ్చారు. లేదంటే పేరు మార్చుకుంటానని కవిత సవాల్ విసిరారు.
ఇక రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కవిత తెలిపారు. ఏ వర్గానికి కూడా వారి జనాభాకు తగిన విధంగా అవకాశాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి బలవంతుడనని వీర్రవీగుతున్నారని...కానీ బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చనిపోయినట్లుగా ఆయనకు పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలో లంబాడాలు లేని తొలి ప్రభుత్వం ఇదేనని ఆమె చెప్పారు. ముస్లింలకు కూడా మొన్నటి వరకు కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదన్నారు.
గత మూడేళ్లలో ముస్లింల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది 1500 కోట్లు మాత్రమేనని అన్నారు. లగచర్లలో లంబాడాలపై ఈ ముఖ్యమంత్రి చేసిన దాష్టీకాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. మక్తల్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దన్న టీచర్, రైతులపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసినందుకు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో నర్సింహుల్ అనే రైతును పోలీసులు కొట్టి చంపారని ఆవేదనతో చెప్పారు.
కుమ్మెర గ్రామంలో 2 నెలల చాకలి సామాజిక వర్గం చిన్నారి చనిపోతే ఇప్పటికీ చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే బహుజనం రాజ్యం రావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందేనని అన్నారు. బీసీలకు, యువతకు అవకాశం ఇస్తున్న తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబు, రేవంత్ తర్వాత నేనే సీఎం
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తాను, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మహా కూటమి తరపున ప్రకారం చేశామని గుర్తు చేశారు. ఆ రోజు కోస్గి సభలో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి సీఎంలు అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే తెలంగాణలో మాతృస్వామ్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరముందని కవిత అన్నారు. ఇన్నాళ్లు అయ్యాలు చేసిన పాలనలో మన బతుకులు ఏం మారాయో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ రాకముందు జరిగిన అన్యాయానికి ఆంధ్రోళ్లు బాధ్యులని అనుకున్నామని కానీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మన బతుకులు ఏం మారాయని ప్రశ్నించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. బాధ్యతలేని పార్టీలు, నాయకుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కదనరంగంలో యుద్దం చేసే నాయకుల అవసరం ఉందన్నారు. అందుకోసం తాను పార్టీ పెట్టి మీ ముందుకు వచ్చానని చెప్పారు. తనకోసమో, కొంతమంది నాయకుల కోసమో పార్టీ పెట్టలేదని, తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేందుకే తెలంగాణ రక్షణ సేన పెట్టానని చెప్పారు. కోస్గీకి తాను 2009 లో టీడీపీతో పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి వచ్చానని అన్నారు. వాళ్లిద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారని తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే తాను కూడా రాష్ట్రాన్ని నడిపిస్తాననే విశ్వాసం ఉందన్నారు.
పాంచజన్యంతో ప్రజల జీవితాల్లో వెలుగులు
సమాజంలో అధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది ధర్మపోరాటాన్ని చేస్తారని.. తాము కూడా తెలంగాణ రక్షణ సేన ద్వారా అదే పనిచేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు విద్య కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. జనంబాటలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్తే అక్కడి పరిస్థితిని ఓ మహిళ తనకు చెబుతుంటే ఎంతో ఆవేదన చెందానన్నారు. తన బిడ్డకు పుట్టిన బిడ్డను చూడాలంటే వెయ్యి రూపాయలు లంచం అడిగారని ఆమె చెప్పిందన్నారు.
ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎంత పెద్ద జబ్బు అయినా సరే ఒక్క రూపాయి కూడా ప్రజలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను ఇవ్వన్నీ చెబుతుంటే కొంతమంది చిన్నపిల్ల, ఆడబిడ్డ అంటూ నవ్వుతున్నారని కవిత అన్నారు. కానీ తాను ఒక తల్లిని అని తల్లి హృదయంతో ఆలోచిస్తానని చెప్పారు. విద్య, వైద్యం కోసం లక్ష కోట్లు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ను నమ్మొద్దు అంటున్నారు. మరి ఆయన బూతులను నమ్మాలా అని ప్రశ్నించారు. మన యువతను నమ్మి వారి బిజినెస్ ఐడియాలను ప్రోత్సహించేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు.
ఇక కోస్గి సభలో గద్దర్ పాటతో కవిత ఆకట్టుకున్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల తీరు గురించి చెబుతూ ఆమె గద్దర్ పాటను పాడారు. భలేగుంది అసెంబ్లీ అంటూ గద్దర్ గతంలో పాడిన పాటను పాడి వినిపించటంతో ప్రజలంతా పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు. మరోవైపు కోస్గీ సభా ప్రాంగణం వేలాది మంది ప్రజలతో కిక్కిరిసి పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కవిత రాకకోసం జనం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ప్రారంభమయ్యే సరికి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి కొడంగల్ కు 200 కార్లతో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వచ్చారు.

హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ నుంచి కోస్గీ వరకు టీఆర్ఎస్ నాయకులు, మహిళలు కవితకు అడుగడుగునా మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. కొడంగల్ నుంచి కోస్గీ వరకు 20 కిలోమీటర్ల దూరం కవిత ప్రత్యేక బస్సులో ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. కోస్గీ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాను కవిత ఆవిష్కరించారు. ఇక కోస్గి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ ప్రాంగణం సీఎం సీఎం నినాదాలతో మార్మోగింది.. కల్వకుంట్ల కవిత మాట్లాడేందుకు ముందుకు వచ్చిన సమయంలో ప్రాంగణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సీఎం సీఎం అని నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications
