కేసీఆర్ సూపర్, వారు తీరు మాత్రం బాగాలేదు: క్లాస్ తీసుకుంటున్న సీఎం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల తన పైన, తెరాస ప్రభుత్వం తీరు పైన, మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు పైన వివిధ ఏజెన్సీల ద్వారా సర్వే చేయించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ఈ సర్వేలో కేసీఆర్‌కు ప్రశంసలు దక్కాయని తెలుస్తోంది.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వేలను కేసీఆర్‌కు నివేదించారు. ప్రభుత్వం పనీ తీరు పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తేలిందని సమాచారం. బాగా పని చేయలేదని సర్వేలో తేలిన వారికి కేసీఆర్ క్లాస్ కూడా పీకారని తెలుస్తోంది.
ఇటీవల దసరా నాడు ఫాం హౌజ్‌లో కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే విజయమని, ప్రతిపక్షాలకు రెండంకెల స్థానాలు కూడా రావని చెప్పారని తెలుస్తోంది. పలు ఏజెన్సీలు చేసిన సర్వే నివేదికలు కొద్ది రోజుల క్రితం ఆయన చేతికి వచ్చాయి.

తెరాస ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ పని తీరు ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెరాసకి ఎంతమంది ఓట్లు వేస్తారు? తదితర అంశాలపై ప్రజల నుంచి మంచి స్పందన వ్యక్తమయిందని తెలుస్తోంది. కేసీఆర్ సూపర్ అని చాలామంది ప్రజలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేనట్లు సమాచారం. వారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అవినీతికి పాల్పడుతున్నారని జనం భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది. కేసీఆర్ పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న ప్రజలు.. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల తీరు పైన మాత్రం వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి చెడ్డపేరు వస్తున్నట్లు సీఎం కేసీఆర్ గుర్తించారు. వారిని అలాగే వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. బ్యాడ్ రికార్డ్ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకోవటం, ఏదైనా పని కోసం వచ్చినప్పుడు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications