‘అన్నా నీ కొడుకు ఉన్నడు కదా! దేవుని దగ్గరికి పోతడు’: సభలో కేసీఆర్ ఆవేశం
నయీం కేసులో ప్రతిపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: నయీం కేసులో ప్రతిపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. నయీం అనే పిశాచాన్ని తెలుగుదేశం ప్రభుత్వం సృష్టిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించిందని ధ్వజమెత్తారు. ప్రజాజీవితంలోకి వస్తానంటూ టిఆర్ఎస్ పార్టీలో చేరిన సాంబశివుడిని నయీం దారుణంగా హత్య చేశాడని కేసీఆర్ చెప్పారు.
సాంబశివుడికి నివాళుర్పించేందుకు వెళ్లిన తాను.. అప్పుడే నయీం లాంటి అరాచక శక్తులను అణిచివేస్తామని చెప్పామని గుర్తు చేశారు. నయీంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే.. తమను భువనగిరి దాటుతావా? అంటూ కొందరు హెచ్చరించారని చెప్పారు. నయీం చేసిన అరాచకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని జీవన్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.
2007లో నయీం తప్పించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేయకపోయినా కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందా? అని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నయీంలాంటి అరాచకశక్తులపై చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే హైదరాబాద్ తోపాటు తెలంగాణలో క్రైం రేటు తగ్గిందని అన్నారు.

నయీం ఎన్ కౌంటర్ తర్వాత భువనగిరి, యాదగిగుట్టలో పర్యటించిన సందర్భంలో చాలా మంది తనను కలిసి సంతోషం వ్యక్తం చేశారని, నయీం బాధలు లేకుండా చేశారని కొనియాడారని చెప్పారు. నయీంను పట్టుకుంటే మరిన్ని అరాచకాలు వెలుగుచూసేవని, కానీ, కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అంతం చేశారని చెప్పారు.
నయీం కేసులో ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో పేకాట బంద్ చేయించామని, మా వాళ్లున్నా విడిచిపెట్టవద్దని చెప్పానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను నిషేధించామని తెలిపారు. అరాచకాలకు పాల్పడితే నయీం అయినా, అతని తాత అయినా విడిచిపెట్టమని తేల్చి చెప్పారు.
దర్యాప్తు జరిగే సమయంలో కేసుకు సంబంధించిన విషయాలను ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి స్యయంగా లాయర్, ఆయనకు దర్యాప్తుకు సంబంధించిన విషయాలు తెలిసుంటాయని అన్నారు. అన్ని అరాచకాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని అన్నారు. నయీం నేర సామ్రాజ్యంలో పాల్పంచుకున్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు వేగం కోసం అధికారులను కూడా పెంచామని తెలిపారు.
ప్రధాని మంత్రి, భారత హోంమంత్రి మన రాష్ట్ర పోలీసులకు కితాబిచ్చారని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసు విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలను బహిర్గతం చేస్తామని చెప్పారు. భారతదేశంలోని బెస్ట్ పోలీస్ మన రాష్ట్రంలో ఉన్నప్పుడు.. సీబీఐకి కేసును అప్పగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీబీఐకి నయీం కేసును అప్పగించేది లేదని స్పష్టం చేశారు.
కరుడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో 124మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు. 27హత్య కేసుల్లో నయీం నిందితుడిగా తేలాడని, మరో 54 హత్య కేసుల్లో కూడా అతడు నిందితుడేనని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగుచూస్తాయని చెప్పారు.
'అన్నా నీ కొడుకు ఉన్నడు కదా! దేవునికి దగ్గరికి పోతడు' అంటూ పలువురిని ఘోరంగా బెదిరింపులకు పాల్పడేవాడని నయీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణాలకు పాల్పడ్డ నయీంను అంతం చేసినందుకు అభినందించాల్సింది పోయి.. మన పోలీసులపై ఆరోపణలు చేస్తారా? అంటూ ఆవేశంగా మాట్లాడారు. నయీం అరాచకాలను చూస్తూ పదేళ్లు కళ్లు మూసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. నయీం కేసులో ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications