మరణానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన హర్షవర్ధన్!

తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు. తాను చనిపోతున్నానని తల్లిదండ్రులతో చెప్పి వారిని ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చాడు. మరణించిన తర్వాత తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి సొంత ఊరు ఖమ్మంకు తరలించేందుకు కూడా ముందే ఏర్పాట్లు చేసుకోగా తాజాగా ఖమ్మంలో ఆ యువకుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఆస్ట్రేలియాకు పయనం: ఖమ్మంకు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ప్రమీల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి హర్షవర్ధన్ (33), అఖిల్ అనే పిల్లలు ఉన్నారు. బీఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం 2013లో ఆస్ట్రేలియా వెళ్లిన హర్షవర్ధన్ బ్రిస్బేన్ లో హెల్త్ మేనేజ్ మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తిచేసి క్వీన్స్ ల్యాండ్ లోని ఒక ప్రయివేటు వైద్యశాలలో వైద్యుడిగా చేరాడు.

 harsha2

బయటపడిన క్యాన్సర్: 2020 ఫిబ్రవరి 20వ తేదీన సొంత ఊరు ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పి అదే నెల 29 తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. 2020 అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయించగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకిందని తేలింది. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఇండియా వచ్చేయమని తల్లిదండ్రులు కోరారు. ఆస్ట్రేలియాలోనే మంచి చికిత్స లభిస్తుందని, మీరేం కంగారు పడకండని వారికి నచ్చచెప్పి అక్కడే చికిత్స తీసుకోవడం ప్రారంభించాడు.

జీవితంలో స్థిరపడేందుకు భార్యకు ఏర్పాట్లు: క్యాన్సర్‌ సోకింది.. తగ్గదు.. మరణం తప్పదు అని తెలిసిన హర్ష వర్ధన్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. తొలుత క్యాన్సర్‌కు చికిత్స తీసుకోగా.. నయమైందని వైద్యులు చెప్పారు. 2022 సెప్టెంబరులో ఖమ్మం వచ్చి రెండువారాలుండి వెళ్లిపోయిన తర్వాత వ్యాధి తిరగబెట్టడంతో చికిత్సకు లొంగదని, మరణం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన బంధువులు, స్నేహితులకు చెప్పాడు.

24న కన్నుమూత: తల్లిదండ్రులకు మరోసారి ధైర్యం చెప్పి తాను మరణించిన తర్వాత మృతదేహాన్ని ఇండియాకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడి చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకునేందుకు ఒక న్యాయవాదిని కూడా నియమించుకున్నాడు. చివరి రోజుల్లో తరచూ బంధువులందరికీ వీడియోకాల్‌ చేసి మాట్లాడేవాడు. కొందరు స్నేహితులను ఇంటికి పిలిపించుకున్నాడు. మార్చి 24న కన్నుమూశాడు. ఆరోగ్యంగా ఉంటే మే 21వ తేదీన హర్షవర్ధన్ స్వదేశానికి రావాల్సి ఉంది. తమ్ముడు అఖిల్ వివాహం ఉంది. కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+