రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామాలు: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రూప్ 1 అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. అభ్యర్థుల్ని చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమన్నారు. కనీసం సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కావాలనే నాటకాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. భద్రత కల్పించి మరీ బండి సంజయ్‌తో ర్యాలీ చేయించారని, బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్ట్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుంది? సంజయ్ ఏం చదివారు? పరీక్షల గురించి ఆయనకేం తెలుసు? పరీక్షపత్రాలు లీక్ చేయించే సంజయ్ గ్రూప్ 1 గురించి ఏం మాట్లాడతారంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ప్రజా పాలన అని ఫోజులు కొట్టిన రేవంత్ రెడ్డి ఈ నిర్బంధం ఎందుకు తీసుకొచ్చావ్..? చర్చలు జరిపేందుకు ఎందుకు భయపడుతున్నవ్. మా నాయకులను అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నవ్ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ కోరారు.
రేపు ఈ రాష్ట్రానికి సారథులుగా వ్యవహరించబోయే గ్రూప్-1 అభ్యర్థులను గొడ్లు, పశువుల మాదిరిగా చూడటం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాది ప్రజా పాలన అని ఫోజులు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు నిర్బంధం తీసుకొచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు
తమ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల తరపున పిటిషన్ దాఖలు చేశారు. మొండిగా మూర్ఖంగా వ్యవహారించకుండా అభ్యర్థులతో చర్చలు జరపాలి. సహేతుకమైన కారణాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications