హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో కేటీఆర్; ఆరోగ్య తెలంగాణాపై కీలక వ్యాఖ్యలు, తనకు డయాబెటిస్ అంటూ..
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అయిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తనకు షుగర్ ఉందన్న కేటీఆర్, 16 ఏళ్ళ క్రితమే తెలిసిందన్న మంత్రి
తనకు షుగర్ వ్యాధి ఉందని పేర్కొన్న కేటీఆర్ ఈ విషయం తనకు 16 ఏళ్ల క్రితమే తెలిసిందని వెల్లడించారు. దీంతో అప్పటి నుంచి తన జాగ్రత్తగా ఉంటున్నానని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్ తనకు షుగర్ వ్యాధి ఉంది అని చెప్పడంతో మీటింగ్ కు వచ్చిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అయిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హెల్త్ ప్రొఫైల్ లో అన్ని పరీక్షలు.. ప్రజల ఆరోగ్య డేటా
తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాలతో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా 220 టీమ్ లు ఇంటింటికీ వచ్చి పరీక్షలు చేస్తారని కేటీఆర్ వెల్లడించారు. హైట్, వెయిట్, బీపీ, షుగర్, హార్ట్, కిడ్నీ ఇతర డేటాను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, కళ్ళను పరీక్షిస్తున్నారని, అక్కడే రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే 60 రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరీక్షలు పూర్తవుతాయని, హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండటం వల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హెల్త్ ప్రొఫైల్ వల్ల రోగుల సంపూర్ణ డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది
ఏ ఆసుపత్రికి వెళ్లినా డేటా క్లియర్ గా ఉంటుందని పేర్కొన్న కేటీఆర్ హెల్త్ ప్రొఫైల్ వల్ల రోగుల సంపూర్ణ డేటా ప్రభుత్వం వద్ద ఉంటుందని పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్ డేటా ఆధారంగా వారికి కావలసిన వైద్య సేవలను అందించడానికి వీలవుతుందని కేటీఆర్ వెల్లడించారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్న మంత్రి కేటీఆర్ అరవై రోజుల అనంతరం మిగతా జిల్లాల్లో కూడా అమలు చేస్తామని వెల్లడించారు.

రోగుల డేటా ఆన్ లైన్ లో ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఉపయుక్తం
హెల్త్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా అత్యవసర సమయాలలో సమయం వృధా కాకుండా వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వైద్యం చేసే వీలుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణాను నిర్మించి దేశానికే ఆదర్శం కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చే వైద్య అధికారులకు సహకరించి అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications