KTR: లోక్ సభ స్థానాల విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: కేటీఆర్
2026లో జనాభా ఆధారంగా లోక్ సభ స్థానాల విభజన చేస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నాయకులు, రాజకీయ పార్టీలు గళమేత్తాలన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు జరిమానా విధించకూడదన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని.. ఇది అన్యాయమని ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయన్నారు. 2026 తర్వాత లోక్‌సభ స్థానాల విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో చాలా బాగా పనిచేశాయని చెప్పారు. భారతదేశంలో 18 శాతం జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో 35 శాతంగా ఉందని కేటీఆర్ అన్నారు.

జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదన్నారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ నొక్కి చెప్పారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు, నాయకులు, ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
లోక్‌సభ డీలిమిటేషన్ ప్రక్రియలో తగని పద్ధతుల కారణంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ, వృద్ధికి గర్వకారణమైన రాష్ట్రాలు బలహీనపడకూడదని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications