ఎందాకైనా పోరాడే ఏకైక టీమ్- కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్ నిర్వహించిన బహిరంగ సభలో చేసిన విమర్శలను భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తిప్పి కొట్టారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు.
బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీకి సీ- టీమ్ అభివర్ణించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ- టీమ్ అంటూ గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలనూ ఆయన గుర్తు చేశారు. తాము బీజేపీకి బీ-టీమ్ కాదు, కాంగ్రెస్‌కు సీ- టీమ్ కాదని తమది ముమ్మాటికీ టీ- టీమ్ అని, బీఆర్ఎస్ అంటేనే టీమ్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ మేలు కోసం, తమ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ తమదేనని కేటీఆర్ చెప్పారు. మోదీ సారథ్యంలో బీజేపీ నాయకులు నిన్నటి దాకా మత రాజకీయం చేశారని, ఇప్పుడు బీసీల పేరుతో కుల రాజకీయానికి తెర తీశారని ధ్వజమెత్తారు.
కేంద్రంలో 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలోని బీసీలకు అరణ్య రోదనే మిగిలిందని కేటీఆర్ విమర్శించారు. కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది..అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టేనని మండిపడ్డారు.
బీసీలంటే మోదీ దృష్టిలో బలహీనవర్గాలు మాత్రమేనని, అదే బీసీలను తాము బలమైన వర్గాలుగా భావిస్తామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాకుండా అనేక పథకాలను ఇచ్చిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్లను లీక్ చేసిందే బీజేపీ నేతలేనని, ఆ నిందితులతో వేదిక పంచుకుని.. తమపై నిందలా అంటూ నిలదీశారు.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌నే మించిపోయిందంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ 10 సంవత్సరాల హయాంలో ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మోదీ ప్రభుత్వం.. రెండుసార్లు రైతుల రుణాలను మాఫీ చేసిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని వివరించారు.












Click it and Unblock the Notifications