భాగ్యనగరంలో బోనాల జాతర - బోనమెత్తిన సింధు..!!
హైదరాబాద్ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ బోనాలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.

బోనాల ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులు సైతం పాల్గొననున్నారు. పెద్ద సంఖ్యలో ఇప్పటికే భక్తులు దేవాలయం వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ తో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రద్దీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ఆమె బోనం సమర్పించారు. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత ఏడాది మాత్రం టోర్నమెంట్ కారణంగా రాలేకపోయింది.

బోనమెత్తిన సింధు.. ప్రత్యేక పూజలు
ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. సింధును ఆలయ కమిటీ సత్కరించింది. తనకు బోనాల పండుగ అంటే ఇష్టమని సింధు చెప్పుకొచ్చారు. ప్రతీ ఏటా ఆశీస్సులు తీసుకోవాలని ఉంటుందని.. గత సంవత్సరం షెటిల్ పోటీలు ఉండటంతో రాలేకపోయానని వివరించారు. కోవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని చెప్పుకొచ్చారు. బోనమెత్తిన సింధు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. తాను తిరిగి ఈ రోజు లండన్ వెళ్లనున్నట్లు చెప్పారు.

మంత్రులు - ప్రముఖుల రాక
ప్రస్తుతం లాల్ దర్వాజ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మంత్రి ఇంద్రకరన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.మైనంపల్లి కుటుంబ సభ్యులు కూడా లాల్‌దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. పలువురు మంత్రులు సైతం ఆలయానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications