ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్!
హైదరాబాద్ నగర అభివృద్ధి పైన, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం పైన తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా కృషి చేస్తుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ప్రాంతమైన ఎల్బీనగర్ హయత్ నగర్ మధ్య 941 కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నగరంలోని 12 లక్షల మంది ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
70 కాలనీలలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
అదుపుతప్పిన ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు, నగరంలో ఉన్నటువంటి 70 కాలనీలలో ప్రజలు దీని వల్ల లబ్ది పొందుతారన్నారు. శాసనసభ వేదికగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 5.50 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం 741 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా 200 కోట్లు సమకూరుస్తున్నట్టు తెలిపారు.

7600 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్
ఈనెల 17వ తేదీన ప్రపోజల్స్ పంపించామని, కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రానున్న ఆరునెలల్లో టెండర్లు నిర్వహించి పనులు చేపడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు 7600 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ విధానంలో 20వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టనుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మదీనాగూడ నుంచి భెల్ వరకు 1.20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం
జాతీయ రహదారి 65 పైన పూణే హైదరాబాద్ మార్గంలో మదీనాగూడ నుంచి భెల్ వరకు 1.20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తుక్కుగూడ నుండి మన్ననూరు వరకు ఇప్పటికే ఆరు వరుసల రహదారి అభివృద్ధి చేపట్టారు. అక్కడ నుండి శ్రీశైలం వరకు సుమారు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి dpr సిద్ధమైనట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
హ్యామ్ విధానంలో మొత్తం 6092.37 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం
రాష్ట్రంలో హ్యామ్ విధానంలో మొత్తం 6092.37 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించి 34 ప్యాకేజీ లలో 441 పనులకు 13 వేల 6 కోట్ల రూపాయలతో టెండర్లు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం 24 ప్యాకేజీల టెండర్ల పరిశీలన జరుగుతుందన్నారు. మరో వారం రోజుల్లోగా పది ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications