అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సీఎం రేవంత్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
Air India Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని ఎయిర్‌పోర్టు నుంచి గురువారం లండన్ బయల్జేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. లండన్ కు వెళ్లేందుకు పూర్తిస్థాయి ఇంధనం నింపుకుని వెళ్తున్న ఈ విమానం కుప్పకూలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పడి ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని తేలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది ఎయిరిండియా సిబ్బంది, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరంతా విమానం కుప్పకూలగానే మంటల్లో చిక్కుకుపోయి అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయిపోయారు. వీరిలో కొన ఊపిరితో ఉన్న కొందరిని ఆస్పత్రులకు తరలించినా డాక్టర్లు వారిని కాపాడలేకపోయినట్లు తెలుస్తోంది. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.

సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఈ దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. బాధితులు, వారి కుటుంబాలకు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన, సమర్థవంతమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
బాధితుల కోసం ప్రార్థిస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవటం పైన విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమానం ప్రమాదంతో షాక్‌కు గురైనట్లు సీఎం తెలిపారు.
కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, వైద్య విద్యార్థులు చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వారిని ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈ ఘటన వల్ల గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుకున్నారు. ప్రభావితమైన అందరి కోసం ప్రార్థనలు చేస్తున్నామన్నారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానంలోని ప్రయాణికుల కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నామన్నారు.
సమగ్ర దర్యాప్తు జరపాలి: అసదుద్దీన్ ఒవైసీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎయిరిండియా ప్రమాదం గురించి ఆందోళనగా ఉందన్నారు. విమానంలోని ఉన్నవారు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నామన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరగాలని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అహ్మదాబాద్‌లో జరిగిన విమానం ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications