ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళన, ఉద్రిక్తత, అరెస్ట్, టీఆర్ఎస్ కౌంటర్
హైదరాబాద్: నగరంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. ఆమె ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
పోలీసుల తోపులాటలో ఓ బీజేపీ కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల ప్రకటన నేపథ్యంలో కవిత ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు.

లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నగర నేతలు కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున మహిళా నేతలు తరలివచ్చారు. ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు, బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడు గౌతమ్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వినిపిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ పదవి నుంచి కవితను తొలగించాలి. ఆమె విచారణకు సహకరించాలని అన్నారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే.. ఢిల్లీలో లిక్కర్ టెండర్లలో కవిత అవినీతికి పాల్పడింది. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని గౌతమ్ రావు డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించి కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications