అప్పుడేం చేసిందదే!: కేసీఆర్‌పై యాష్కీ తీవ్ర వ్యాఖ్య, కవితపై ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలో గల్ఫ్ ఏజెంటుగా పని చేశారని మండిపడ్డారు. ప్రవాసీయుల పేరిట కేసీఆర్ కుటుంబం మోసాలకు పాల్పడుతోందన్నారు.
తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం పేరిట కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ప్రవాసీయుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
బహ్రెయిన్‌లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూతురు, కొడుకు గల్ఫ్ ప్రవాసీయుల పేరిట డ్రామాలు ఆడుతున్నారని, విహార యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ సంస్కృతి పేరిట ఎంపీ కవిత విదేశాలలో సాంస్కృతిక దండయాత్రలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రం వచ్చాక కూడా సాంస్కృతిక ఉద్యమం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ మనోభావాలను, సంస్కృతిని కేసీఆర్ కుటుంబం విదేశాలలో తమ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం దుర్వినియోగం చేస్తోందన్నారు.
ఆకలితో కాలే కడుపును నింపాల్సింది పోయి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవాసీ పేదల రేషన్ కార్డులను రద్దు చేస్తోందన్నారు. స్వచ్ఛంద సేవా సంస్ధ పేర తెలంగాణ జాగృతి అడ్డదారిన నిధులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాక్ సంస్థను నిర్వీర్యం చేసి ఇప్పడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని ప్రకటించడం దేనికి సంకేతమన్నారు. తెలంగాణ యువత ఎడారి దేశాలలో దౌర్భగ్య పరిస్ధితులలో నగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications