Maha shivratri 2023: హరహర మహాదేవ... కన్నులపండుగగా వేములవాడ రాజన్న మహా శివరాత్రి జాతర!!
వేములవాడ రాజన్న మహా శివరాత్రి జాతర నిన్న రాత్రి కన్నుల పండువగా ప్రారంభమైంది. ఇవాళ శివరాత్రి కావడంతో వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది.
నేడు మహాశివరాత్రి పర్వదినం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి వేములవాడలో కన్నుల పండువగా మహా శివరాత్రి జాతర ప్రారంభం అయింది. జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు.

శోభాయమానంగా వేములవాడ
మహాశివరాత్రి జాతర వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో రాత్రి సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా కనిపించాయి.
ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన రహదారుల వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలం వైపు నుంచి ధర్మగుండానికి కొత్తగా గేట్లు పెట్టారు.

వేములవాడ రాజన్న మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు ఇలా
జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ నుంచి కట్ట కింద బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను నడుపుతున్నారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు నల్లాలు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా మొబైల్ మూత్రశాలలను ఏర్పాటు చేశారు.

వేములవాడలో మహాశివరాత్రి జాతరకు శివార్చన.. ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు శివార్చన కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ప్రారంభించారు.

కేసీఆర్ మార్గదర్శనంలో వేములవాడ అభివృద్ధి
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కేసిఆర్ మార్గదర్శనంలో నే గుడి చెరువును ముందుకు జరిపి 35 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ , సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా మార్చినట్టు చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శివార్చన కార్యక్రమం చాలా గొప్ప గా ఉందన్నారు. కళా క్షేత్రాన్ని పర్మనెంట్ చేయాలని మంత్రి కే టి ఆర్ ఆలోచన చేస్తున్నారని దానిని సాకారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మంత్రి కేటీఆర్ సహకారంతో కన్నుల పండుగగా వేములవాడ శివరాత్రి జాతర: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో వేములవాడ లో మహాశివరాత్రి జాతర ను కన్నుల పండువగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక రూ. 20-30 కోట్లతో వేములవాడ నియోజకవర్గంలో నే చిన్న దేవాలయాల అభివృద్ధికి వెచ్చించడం జరిగిందన్నారు. వేములవాడ ప్రాంతం కళలకు పుట్టినిల్లు అని, సినారె పుట్టిన గడ్డని పేర్కొన్నారు. వేములవాడ వెన్నెల వాడ గా ప్రసిద్ధంకాబడ్డ ఈ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా జరగడం ఆనందంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications