Mahakumbh Mela 2025: సికింద్రాబాద్ నుంచి యాత్రా స్పెషల్ - రూట్, ప్యాకేజీ..!!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది త్రివేణి సంగమానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే ఆరున్నార కోట్ల మంది స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుంభ మేళాకు వెళ్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ తో ఐఆర్‌సీటీసీ తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రా బాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక రైలును ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు సాగే యాత్రా స్పెషల్ ప్యాకేజీని వెల్లడించింది.
కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు 22న తిరిగి నగరానికి చేరుతుంది. వారంరోజుల పాటు జరిగే ఈ మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు పలు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల మీదుగా ప్రయాణిస్తుంది. భక్తులు వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను దర్శించుకుని ఎనిమిది రోజుల్లో తిరిగి చేరుకునేందుకు వీలుగా ఈ ప్యాకేజీని రూపొందించింది. మొత్తం 578 మంది సామర్ధ్యం తో కూడిన ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 18న ప్రయాగ్‌రాజ్‌కు చేరుకొని..అక్కడ కుంభమేళాలో భక్తులు పాల్గొంటారు.

ఇక, ఆ తరువాత 19న వారాణసీ లో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని, ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని 20న అయోధ్య చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసారు. తిరిగి ఈ ప్రత్యేక రైలు 22 రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. యాత్రికులు ఎక్కి, దిగేందుకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్ స్టేషన్లలో ఆగుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
యాత్ర ప్యాకేజీలో ఎకానమీ (ఎస్‌ఎల్) పెద్దలకు రూ.23,035, పిల్లలకు (5-11 ఏళ్లలోపు) రూ.22,140లుగా చార్జీలు ఖరారు చేశారు. ఏసీ బోగీల చార్జీలు వేరుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కుంభమేళా కోసం రైల్వే పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ ప్రత్యేక రైలు యాత్రా స్పెషల్ గా ఖరారు చేసినట్లు అధికారులు వివరించారు. అయితే, రెగ్యులర్ తో పాటుగా ప్రత్యేక రైళ్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని మరి కొన్ని సర్వీసుల పై నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications